Wednesday 9 October 2013

లాంతరు చెండు (పార్ట్ 3)

         లాంతరు చెండు  (పార్ట్ 3).... (యెర్ర అరుగుల కధలు సీరీస్ )

(part 2 link ikkada )

(part 1 link ikkada )

అందరు ఆడవాళ్ళు వంట చేసుకొని పదకొండు కల్లా వచ్చేసారు
మళ్ళా మొగవాళ్ళు భోజనానికి వచ్చేసరికి కావాల్సిన చెండ్లు 
కుట్టి వెళితేనే మధ్యాహ్నం జడ వేయగలరు . 
పూల సరం అంటే రెండు పూలు అటొకటి ఇటొక పువ్వు  పెట్టి చేతివేళ్ళతో 
దారం తిప్పుతూ అల్లుతారు . మామూలుగా అమ్మేవి ఇవే . 
ఇవి ఎక్కడకు కావాలంటే అక్కడ వరకు తుంచుకోవచ్చు.   . 
కాని చెండ్లు అలా కాదు మనకు ఎంత పొడవు కావాలో ముందే 
చూసుకొని అందరు సరిపోతుందా అనుకోని సూదితో కుడుతారు . 
అట్టజడ అయితే బాధ లేదు . ఆకులు కావాల్సిన విధంగా కట్ చేసుకొని 
మల్లె పూలు గుచ్చిన ఈనె పుల్లలు అటు ఒకటి ఇటు ఒకటి ఉంచి 
మధ్య ఖాళీలో అడ్డంగా కొన్ని వరుసలు మల్లెలు ,కొన్ని వరుసలు 
కనకాంబరాలు , కొన్ని వరసలు ఆకు కుట్టేస్తారు . 
తరువాత కుచ్చుల జడపై ఉంచి అక్కడక్కడ సప్పోర్ట్ గా టాకాలు వేసేస్తారు . 

కాని పూలు కుచ్చుల జడపై ఉంచి కుట్టేటపుడే చాల రకాల చెండ్లు కావాలి . 
ముందు నెత్తి బిళ్ళ చిన్న జడతో నడినెత్తి మీద వేసి దాని చుట్టూ ఆకు చెండు 
దాని చుట్టూ కనకంబరాల చెండు  దాని చుట్టూ మల్లెల చెండు మూడు 
వరసలు పెడుతారు . జడ మీద అన్ని పూలు కుట్టేస్తారు . 
 ఇప్పుడు పైన నెత్తి బిళ్ళకి జడకి మధ్య ఖాళీ ఏర్పడుతుంది . 
అదిగో దాని కోసం కుడతారు లాంతరు చెండు . 
అది ఎంత చక్కగా కుడితే జడకు అంత అందం . 
అందుకే బాగా కుట్ట గలిగిన  వాళ్ళే  ఆ పని చేస్తారు . 

మామూలు మల్లెల చెండు  కి సూదికి మూడు 
మల్లెలు పక్క పక్కన వచ్చేట్లు కుడుతారు . 
అంటే ఒక వైపు పూలు ఒక వైపు పూల కాడలు 
కనిపిస్తాయి . అది తల పైన పెట్టేస్తారు . 
తొడిమలు బయటకు కనపడకుండా . 
లాంతరు చెండుకు మాత్రం దారం చుట్టూ 
మొగ్గలు వచ్చేట్లు సూదికి కుడుతారు . 
అంటే మీకు ఎక్కడ చూసినా పూలే . 
తొడిమలు కనపడవు . 
చాల అందంగా ఉంటుంది . 

పెదమ్మ కూడా వంట చేసుకొని వచ్చింది . ఒకరు ఈనె పుల్లలకి పూలు 
గుచ్చితే ,ఒకరు మల్లెలు చెండ్లు ,ఒకరు కనకాంబరాలు కాలి పట్టీ ... 
వేళ్ళు నైపుణ్యంగా మెలికలు తిరుగుతూ ఉన్నా మాటల దారి 
మాటలదే . నేను చూస్తూ పూలు అందిస్తూ వాళ్ళు తెమ్మన్నవి తెస్తూ 
తెగ తిరిగేస్తున్నాను .
 మామూలుగా అసలు పని చేయను . 
కాని జడ మీద ఇంట్రెస్ట్ . 
పెద్ద అయినాక మా చెల్లికి మొగిలి పూలు ,
ముత్యాలు ఎన్నో జడలు వేసాను . 
ఎందరు పెళ్లి కూతుర్లకు వెసానో . 

పెదమ్మ అంటూ ఉంది
 ''చిన్నమ్మాయి జడ మధ్యలో చిన్న బొమ్మలు పెడదాము '' 
''అలాగే అక్క . ఎవరి ఇంట్లో ఉన్నాయి చెప్పు .తెప్పిద్దాము ''
''ఆ పక్క వాళ్ళు మొన్న సంపంగి పూలతో జడ వేసారు కాని భలే బరువుగా 
ఉంది . పిల్లలు మోయలేరు '' 
''ఏమి లంగా వేసుకుంటావు . ఏమి దండ వేసుకుంటావు '' మురిపెంగా 
అడిగింది పెదమ్మ నన్ను ....
 కళ్ళు ఆర్పకుండా పూలు కుట్టే వైపే చూస్తూ ఉంటె . 

''ఒయ్ శశి జడ అంటే తమాషానా ... కదిలితే సూదితో గుచ్చుతాము తెలుసా ?''
అంది సులోచన అక్క . ఇంకా శైల అక్క సులోచన ఆత్త కూతురు సుజాతక్క అందరు 
కుట్టినవి జాగ్రత్త్తగా తడి బట్టలో చుట్టిపెడుతున్నారు వాడిపోకుండా . 

''ఇక పదండి అందరు అన్నం తిందురు కాని '' చెప్పింది పెదమ్మ . 

కావలి లో ట్రంక్ రోడ్ ఇటు వైపు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే 
రోడ్ కి ఆ వైపు పది ఇళ్ళు తరువాత రామాలయం ,కొంచెం పక్కగా 
పోలీస్ స్టేషన్ ఉంటుంది . దాని పక్కన పెదమ్మ వాళ్ళ ఇల్లు . తొమ్మిది 
మంది పిల్లలం ఆడుకుంటూ అన్నం సమయానికి ఎక్కడ ఉంటామో 
తెలీదు  . అందుకని అమ్మమ్మ ,పెదమ్మ ఇద్దరు ఎక్కువగా వండి పెట్టేవారు . 
పిల్లలకు ఎక్కడ ఆకలి అవుతుందో అని . 

ఇందరికి అమ్మ అయినా ,పెదమ్మ అయినా చేతి ముద్దలు కలిపి పెడుతారు . 
మేము అందరం కబుర్లు ,కధలు చెపుతూ ఉంటె ఊ కొడుతూ తింటాము . 
అమ్మ పెద్ద ముద్దలు పెడుతుంది . అంటే మేము ఒక్క ముద్ద తినేలోపు 
అందరికి తలా ఒక ముద్ద పెట్టొచ్చు . కాని పెదమ్మ అలా కాదు చిన్ని చిన్ని ముద్దలు 
సరిగ్గా ఒక్క సారి నోరు పట్టే అంత ముద్దలు ,ఒక్క సారి నోట్లో పెట్టుకుంటే 
చేయి ఖాళి . అందుకు పెదమ్మ స్పీడ్ గా పెట్టేది చేయి ఎండిపోతుంది అని . 

తింటూ ఉంటాము ,నవ్వుకుంటూ ఉంటాము . కాని పెదనాన్న వస్తే గప్ చిప్ . 
తినేటపుడు   పొర పోతుంది అంటారు . 
ఏమి అరవరు .అసలు  అరిచి ఎవరు చెప్పరు . 
ప్రేమగా చెపుతారు కాని మాట వినాల్సిందే . 

భోజనం అయిపోగానే సులోచన అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి పోయాము . 
సవరం ,కుచ్చులు ,నెత్తి బిళ్ళ తీసుకొని దువ్వెన పట్టుకొని కూర్చొని ఉంది . 
నేను .... పరిగెత్తుకొని వెళ్లి కూర్చోపోయాను . 
''జడ నీకు లేదు . రాణి నువ్వు రామ్మా '' అక్కని పిలిచి కూర్చో పెట్టుకొని 
దువ్వసాగింది . 

నాకు పూల జడ లేదా ?ఒక్క సారి ఏమి అర్ధం కాక రోషం ,కళ్ళలో నీళ్ళు . 
అసలు నేను నిన్నటి నుండి ఎంత ఆశగా ఉంటె నాకు ఎందుకు లేదు . 
నిరసన తెలపాలి అంటే నాకు ఉండే ఒకే ఆయుధం ... 
దభీమని కింద నేల మీద పడుకోని  వాఆఆఆఆఆఆఆఆఆఆ ..... కాళ్ళు 
చేతులు విదిలిస్తూ ''నాకు పూల జడ కావాలి '' 
అందరు ఉలిక్కిపడ్డారు . 


                                                           (ఇంకా ఉంది )

No comments: